500+ రన్స్ కొట్టినా భారత్ గెలవలేదా? 10 ఏళ్ల నాటి బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్!

500+ రన్స్ కొట్టినా భారత్ గెలవలేదా? 10 ఏళ్ల నాటి బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్!

Team India: శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 503/9 పరుగుల భారీ స్కోరు సాధించినా విజయాన్ని అందుకోలేకపోయింది. సోనాల్ దినూషా (133), పసిందు సూరియబండార, కమిందు మెండిస్, కేశర నువంత అద్భుతంగా పోరాడటంతో లంక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. టెస్టు క్రికెట్‌లో 500+కు పైగా పరుగులు చేశాక దాదాపు ప్రతీ జట్టూ విజయంపై ధీమాతో ఉంటుంది. కానీ 500 ప్లస్ స్కోరు సాధించి కూడా మ్యాచ్‌ను గెలవలేకపోవడం భారత్‌కు దాదాపు పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

2017 ఢిల్లీ టెస్టు సీన్ రిపీట్:

ఇంతకంటే ముందు 2017 డిసెంబర్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఢిల్లీ (అరుణ్ జైట్లీ స్టేడియం) వేదికగా జరిగిన టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 536/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ చేయగా, భారత్ శ్రీలంకకు 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ధనంజయ డి సిల్వా (119) వీరోచిత పోరాటంతో శ్రీలంక ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మళ్లీ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కొలంబో టెస్టులోనూ అదే సీన్ రిపీట్ కావడం విశేషం.

సుదీర్ఘ పోరాటంతో చుక్కలు చూపించిన దినూషా:

శ్రీలంక యంగ్ బ్యాటర్ సోనాల్ దినూషా ఈ సిరీస్‌లో భారత బౌలర్లకు నిజమైన నిద్రలేకుండా చేశాడు. కొలంబో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 420 నిమిషాల పాటు క్రీజులో నిలబడి 264 బంతుల్లో 133 పరుగులు సాధించి లంకను ఓటమి నుంచి కాపాడాడు. ఈ సిరీస్‌లో దినూషాకు ఇది మూడో సెంచరీ కాగా, భారత్‌పై వరుసగా నాలుగోసారి 50+ స్కోరు సాధించడం విశేషం. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో అతడు ఏకంగా 1139 నిమిషాల పాటు క్రీజులో గడిపి 722 బంతులను ఎదుర్కొన్నాడు.

సిరీస్ భారత్ వశం.. కానీ దక్కని వైట్‌వాష్:

కొలంబో టెస్టులో లంక అసాధారణ రీతిలో పుంజుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకున్నప్పటికీ, గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–0 తేడాతో కైవసం చేసుకుంది. ఏది ఏమైనా 500 ప్లస్ రన్స్ కొట్టి కూడా లంకను ఆలౌట్ చేయలేకపోవడం, సిరీస్ వైట్‌వాష్ చేసే అవకాశం చేజారడం గిల్ సేనకు మింగుడుపడని విషయమే.